: నాన్నగారిని ఇంత ఉన్నత స్థానానికి ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది: వెంకయ్యనాయుడు కూతురు దీపా వెంకట్
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ఎం. వెంకయ్యనాయుడు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకయ్యనాయుడు కూతురు దీపా వెంకట్ మాట్లాడుతూ, ‘నాన్నగారిని ఇంత ఉన్నత స్థానానికి ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంతమందిలో ఆయనకు ఈ అవకాశం రావడం అదృష్టం. ఆ అవకాశాన్ని ఆయన్ని సద్వినియోగం చేస్తారనే విశ్వాసం ఉంది. నాన్నగారి నుంచి నేర్చుకున్నది, అబ్బురపడిపోయేది ఏంటంటే, ఎక్కడా కూడా ఆయన ఆగలేదు. ఫుల్ స్టాప్ అనేది లేకుండా కొనసాగారు. గెలిచినా అలానే ఉండేవారు, ఒకవేళ ఓడిపోతున్నామని తెలిసినా కూడా.. ‘తల్లీ మనం ఓడిపోతున్నాం..ఏం ఇబ్బందిలేదు..’ అని చెప్పేవారు. ఆ సిద్ధాంతమే ఆయన్ని ఇంత దూరం తీసుకువచ్చింది.
పార్టీ ఆయనకు తల్లి లాంటిదని ఎప్పుడూ చెబుతుంటారు. చిన్న తనంలోనే ఆయన తన తల్లిని కోల్పోయారు. డిస్టర్బ్ చైల్డ్ హుడ్ లో ఉండీ కూడా ఆయన స్వశక్తితో ఎదిగారు. ఆర్ఎస్ఎస్ తో విడదీయరాని బంధం ఆయనకు ఏర్పడిపోయింది. ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ లోకి నాన్న గారు రావడం జరిగింది. నాకు, మా అన్నయ్యకు అయితే మా లైఫే బీజేపీ. అప్పుడు పార్టీకి దీపం గుర్తు ఉండేదని, నాకు దీప అనే పేరు మా నాన్నగారు పెట్టారు. సో, బీజేపీని, నాన్నగారిని వేర్వేరుగా చూడలేం. ఇప్పుడు, పార్టీలో నాన్నగారు లేరనే బాధ తప్పా వేరేదేమీ లేదు. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత నాన్నగారు ఎలా ఉండగలరనేది ఆలోచించలేకపోయాం, ఎందుకంటే, దానికి మా వయసు సరిపోదు కాబట్టి. ఎప్పుడూ కూడా ఫలానాది నాకు కావాలని నాన్నగారు ఎప్పుడూ ఆశించలేదు. మేము కూడా ఆయనకు ఏది సంతోషాన్ని కలిగిస్తుందో, అదే చేసేవాళ్లం’ అని దీపా వెంకట్ చెప్పుకొచ్చారు.