: లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళల్లో 70 శాతం మౌనంగా భరిస్తున్నారు!: జాతీయ మహిళా కమిషన్!
తాము పనిచేస్తున్న ప్రదేశాల్లో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళల్లో 70 శాతం మంది ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) మెంబర్-సెక్రటరీ సత్బీర్ బేడీ తెలిపారు. తెలంగాణ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘సెక్స్‌వల్ హరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్‌ప్లేస్’ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రెడ్రెసల్) యాక్ట్ 2013పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న బేడీ మాట్లాడుతూ ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చేయడానికి 70 శాతం మంది మహిళలు ముందుకు రావడం లేదని, వారు ఆ వేధింపులను మౌనంగా భరిస్తున్నారని తెలిపారు.
చాలామంది చట్టాల్లోని లోపాలను తమకు అనుగుణంగా ఉపయోగించుకుని బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతున్నారని పేర్కొన్నారు. లైంగిక వేధింపులు, చట్టాలపై మహిళల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కి చెప్పారు. లైంగిక వేధింపులను మహిళా ఉద్యోగులు ధైర్యంగా ఎదుర్కోవాలని హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ జి.యతిరాజులు పిలుపునిచ్చారు. మహిళలపై లైంగిక వేధింపుల విషయంలో చట్టాన్ని మరింత కఠినంగా రూపొందించేందుకు అవసరమైన ప్రతిపాదనలు చేసినట్టు తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ టి.వెంకటరత్నం తెలిపారు. ఉద్యోగినులు లైంగిక వేధింపులకు గురవుతున్నా చాలా సంస్థలు అస్సలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.