: మీ ఆధార్ సమాచారానికి ఇలా తాళం వేయండి.. నిశ్చింతగా ఉండండి!
ఆధార్ రూపంలో ఉన్న మన వ్యక్తిగత సమాచారం గోప్యంగానే ఉందా? లేక అసాంఘిక శక్తుల చేతిలో పడుతోందా? ఇటీవల వస్తున్న వార్తలు చూస్తుంటే ఆధార్ డేటాను ఇతరులు చాలా సులువుగానే చేజిక్కించుకుంటున్నట్టు తెలుస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కుటుంబ సభ్యుల ఆధార్ సమాచారం లీకైనట్టు ఇటీవల వార్తలు వచ్చాయి కూడా. ఈ నేపథ్యంలో బయోమెట్రిక్ డేటా లీక్ కాకుండా ఉండేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది.
ప్రభుత్వ పథకాలన్నింటికీ ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయడం, ఆర్థిక లావాదేవీలకు కూడా ఆధార్ నంబరు తప్పనిసరి చేయడంతో థర్డ్ పార్టీ చేతిలో పడుతున్న ఆధార్ వివరాలు అక్కడి నుంచి అసాంఘిక శక్తుల చేతిలో పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు తమ ఆధార్ డేటాను అత్యంత సురక్షితంగా ఉంచుకునే మార్గాన్ని ఆధార్ సంస్థ యూఐడీఏఐ పేర్కొంది. ఆధార్ డేటాను లాక్ చేసుకుని అవసరమైనప్పుడు అన్ చేసుకునే విధానాన్ని తెలియజేసింది. ఇందుకోసం కొంత ఇంటర్నెట్ పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది.
ఆధార్ వెబ్‌సైట్ యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్ సర్వీసెస్ లింక్‌పై లాక్/అన్‌లాక్ బయోమెట్రిక్స్‌ను క్లిక్ చేయాలి. అలా చేయగానే http://resident.uidai.gov.in/biometric-lock పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో నిర్దేశించిన చోట ఆధార్ నంబరు, సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయాలి. ఆ వెంటనే రిజస్టర్ మొబైల్ నంబరుకు వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) వస్తుంది. దీనిని ఎంటర్ చేసిన వెంటనే ఆధార్ వివరాలు లాక్ అయిపోతాయి. అంటే వేరెవరూ వాటిని చూడలేరన్నమాట. ఎవరైనా చూసేందుకు ప్రయత్నిస్తే పేజీపై ‘ఎర్రర్ కోడ్ 303’ అని చూపిస్తుంది. అంటే మన ఆధార్ వివరాలు భద్రంగా ఉన్నట్టు లెక్క. ఇలా లాక్ చేసుకోవడం వల్ల మొబైల్ ఆపరేట్లు, ఇతర సంస్థలు మన డేటాను దొంగిలించలేవు. ఒకవేళ ఎవరికైనా అనుమతి ఇవ్వాలంటే మాత్రం ఇంతకుముందు చేసినట్టుగానే ఆన్‌లాక్ చేయవచ్చు.