: `మిర్రర్ నౌ` రిపోర్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సీబీఎఫ్‌సీ చైర్మన్!
ఎక్కడపడితే అక్కడ తనను ప్రశ్నలతో వేధిస్తూ, వ్యక్తిగత జీవితాన్ని టీవీలో ప్రసారం చేస్తూ స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ, `మిర్రర్ నౌ` రిపోర్టర్ హిమాంశు చౌదరిపై సీబీఎఫ్‌సీ చైర్మన్ పహ్లాజ్ నిహలానీ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. `జబ్ హ్యారీ మెట్ సెజల్` సినిమా విషయంలో `ఇంటర్‌కోర్స్` అనే పదాన్ని తొలగించకుండా ఉంచడానికి ప్రజల అభిప్రాయం కావాలని సీబీఎఫ్‌సీ కోరిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో `మిర్రర్ నౌ` ప్రతినిధులు ప్రజాభిప్రాయం సేకరించి తమ రిపోర్టర్ ద్వారా నిహలానీ వద్దకు పంపించారు.
అప్పుడు హిమాంశు అడిగిన ప్రశ్నలకు నిహలానీ ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోతుంటే, ఆమె ఆయనను లిఫ్ట్‌లో వెంటపడుతూ ప్రశ్నించారు. ఆ వీడియోను ఎలాంటి ఎడిటింగ్ లేకుండా మిర్రర్ నౌ ప్రసారం చేసింది. ఇవాళ కూడా హిమాంశు తన కార్యాలయంలో ఇష్టం వచ్చినట్టు ప్రశ్నలు అడిగి వేధించిందని నిహలానీ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై మిర్రర్ నౌ ఎడిటర్ ఫాయే డిసౌజా స్పందిస్తూ - పహ్లాజ్ నిహలానీ రిపోర్టర్ చెయ్యి పట్టుకుని లాగారని, తిరిగి ఆమెపైనే ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. `జబ్ హ్యారీ మెట్ సెజల్` వివాదానికి సంబంధించి హిమాంశు, నిహలానీని ప్రశ్నించిన వీడియో ఇక్కడ చూడొచ్చు.