: చైనా ఉత్పత్తులను నిషేధించండి... భారత ప్రజలకు రామ్‌దేవ్ బాబా పిలుపు
సిక్కింలోని డోక్లాం సరిహద్దు ప్రాంతంలో భారత్ - చైనా దేశాల మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ప్రతి ఒక్క భారతీయుడు చైనా ఉత్పత్తులను నిషేధించాలని యోగా గురువు రామ్‌దేవ్ బాబా పిలుపునిచ్చారు. `పాకిస్థాన్ తీవ్రవాదులకు చైనా ప్రత్యక్షంగా మద్దతు తెలుపుతోంది. ఆ రెండు దేశాలకు మనం బుద్ధి చెప్పాలి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌లో కలుపుకుని పాకిస్థాన్‌కు, చైనా ఉత్పత్తులను నిషేధించడం ద్వారా చైనాకు గుణపాఠం చెప్పాలి` అని రామ్‌దేవ్ బాబా అన్నారు.
అలాగే తమ రాజకీయ వైషమ్యాలు పక్కనపెట్టి రాజకీయ పార్టీలన్నీ ఈ విషయంపై ఏకం కావాలని ఆయన తెలియజేశారు. గతంలో ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఒడిషా ట్రేడర్స్ అసోసియేషన్ వ్యాపారులు చైనా ఉత్పత్తులపై విధించిన నిషేధాన్ని ఆయన గుర్తుచేశారు. వారి బాటలోనే ఇతర వ్యాపారస్తులు కూడా నడవాలని రామ్‌దేవ్ బాబా కోరారు. గత నెలన్నర రోజులుగా భారత్ - చైనా సైన్యాల మధ్య డోక్లాం సరిహద్దు ప్రాంతంలో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే!