: ఫుట్‌బాల్ కోచ్ అవడం కోసం తన చిరకాల కోరికను వదిలేసిన కశ్మీర్ యువతి!
తనకు ఎంతో ఇష్టమైన ఆటలో మెలకువలను కొత్త తరానికి పంచడం కోసం సివిల్ ఇంజినీర్ అవ్వాలన్న కలను వదులుకుంది ఈ కశ్మీరీ యువతి. ముస్లిం సంప్రదాయాలకు మారుపేరుగా కనిపించే కశ్మీర్ లోయలో టీషర్ట్, టోపీ పెట్టుకుని పిల్లలకు ఫుట్‌బాల్ పాఠాలు చెబుతున్న ఆమె స్థైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. శ్రీనగర్‌కు చెందిన 23 ఏళ్ల ఖాద్సియా అల్తాఫ్ నెలకు రూ. 5000 వేతనానికి జమ్మూ కశ్మీర్ స్టేట్ స్పోర్ట్స్ కౌన్సిల్లో ఫుట్‌బాల్ కోచ్‌గా జాయిన్ అయ్యింది. ప్రధానమంత్రి మోదీ ప్రారంభించిన `ఖేలో ఇండియా ప్రోగ్రాం`లో భాగంగా జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆమెకు ఫుట్‌బాల్ కోచ్ పదవిని ఇచ్చారు.
అప్పటినుంచి అండర్-14, అండర్-17 బాలురు, బాలికల జట్లకు ఖాద్సియా కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. 2007 నుంచి ఖాద్సియా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్లలో పాల్గొన్నారు. కానీ తనకు ఇంతవరకు దేశం తరఫున పాల్గొనే అవకాశం రాలేదని, అందుకే తన విద్యార్థులను అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్లలో విజయాలు సాధించేలా తీర్చిదిద్దుతానని ఖాద్సియా పేర్కొంది.