: బాలీవుడ్‌లో బంధుప్రీతిపై స్పందించిన సూపర్ స్టార్ షారూక్!


బాలీవుడ్‌లో విస్తృత చర్చకు దారి తీసిన నెపోటిజమ్ (బంధుప్రీతి)పై ఎట్టకేలకు సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ స్పందించాడు. బంధుప్రీతిపై తనకు ఎటువంటి అభిప్రాయం లేదన్నాడు. ‘‘నాకెందుకో నెపోటిజమ్ గురించి ఇప్పటికీ అర్థం కావడం లేదు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? నేను ఢిల్లీకి చెందిన వాడిని. నన్ను అందరూ ఇష్టపడుతున్నారు. అందరూ అంగీకరించారు. కాబట్టి ఈ చర్చ ఎందుకో నాకు అర్థం కావడం లేదు’’ అని షారూక్ తేల్చి చెప్పాడు. ఢిల్లీకి చెందిన షారూక్ 25  ఏళ్ల వయసులో ముంబై వచ్చాడు.

షారూక్‌కు ఆర్యన్, సుహానా, అబ్‌రామ్ ముగ్గురు సంతానం. వారు తమ కాళ్లపై సొంతంగా నిలబడాలనే తాను కోరుకుంటానని పేర్కొన్నాడు. ‘‘వారు మెరైన్ బయాలజిస్ట్ (సముద్ర జీవశాస్త్రవేత్త) కావాలంటే అవొచ్చు. అది వారిష్టం. వారు నటులుగానో, దర్శకులుగానో స్థిరపడాలన్నా అలాగే చేయొచ్చు. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు’’ అని స్పష్టం చేశాడు. నెపోటిజమ్‌పై చర్చ ఎందుకో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు.

తనకు ఇంగ్లిష్ బాగా తెలిసినప్పటికీ నెపోటిజంపై జరుగుతున్న చర్చ మాత్రం తనకు అర్థం కావడం లేదన్నాడు. తాను దీనికి అంగీకరిస్తానా? లేదా? అన్నది తర్వాత విషయమని, ముందైతే తనకు ఈ విషయం అర్థం కావాలి కదా? అని షారూక్ పేర్కొన్నాడు. బాలీవుడ్‌ బంధుప్రీతిలో మునిగిపోయిందంటూ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు నెపోటిజమ్‌పై చర్చకు కారణమయ్యాయి.

  • Loading...

More Telugu News