: రైతుకు రైతే శత్రువు అవుతున్నాడు: సీఎం కేసీఆర్
ఒక రైతు వేసిన పంటనే మరో రైతు, ఇంకో రైతు వేలం వెర్రిగా పండిస్తుండటం వల్ల గిట్టుబాటు ధర లేక రైతుకు రైతే శత్రువు అవుతున్నాడని, ఆ విధంగా జరగకుండా చూసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. హైదరాబాద్ శివారు శామీర్ పేట మండలంలోని లక్ష్మాపూర్ గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా రైతుల పరిస్థితి బాగుండలేదని, ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా రైతులు రోడ్డెక్కుతున్న పరిస్థితులు ఉన్నాయని అన్నారు.
మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతు సంఘాల ఏర్పాటు ప్రక్రియకు తెలంగాణ సర్కార్ పూనుకుందని అన్నారు. గ్రామ రైతు సమన్వయ సమితిల సమాహారంగా మండల రైతు సమాఖ్య, మండల రైతు సమాఖ్యల సభ్యులతో జిల్లా రైతు సమాఖ్య, జిల్లా రైతు సమాఖ్య సభ్యులతో రాష్ట్ర రైతు సమాఖ్య ఏర్పాటు అవుతుందని, ప్రతి సమాఖ్యకు సమన్వయ సమితిని ప్రభుత్వం నియమిస్తుందని కేసీఆర్ చెప్పారు.