: `వాన్నా క్రై` ర్యాన్సమ్‌వేర్‌ను కట్టడి చేసిన వ్యక్తికి జైలు శిక్ష... వేరే కేసులో పట్టుబడ్డ హ్యాకర్!
గత మే నెలలో 150 దేశాల్లో కంప్యూటర్లను హ్యాక్ చేసిన `వాన్నా క్రై` ర్యాన్సమ్‌వేర్‌ను కట్టడి చేయడానికి కిల్ స్విచ్‌ను రూపొందించిన మార్కస్ హచిన్స్‌ను లాస్ వేగాస్ పోలీసులు అరెస్టు చేశారు. `వాన్నా క్రై` సంఘటన కంటే ముందు మార్కస్ పాల్పడ్డ హ్యాకింగ్ చర్యలను నేరంగా పరిగణిస్తూ అతన్ని అరెస్టు చేశారు. `క్రోనోస్` అనే మాల్‌వేర్ కోడ్‌ను పంపిణీ చేసి, అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడని మార్కస్‌పై కేసు నమోదు చేశారు. ఈ మాల్‌వేర్ కోడ్ ద్వారా బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ వివరాలను తెలుసుకుని డబ్బు దొంగిలించవచ్చని పోలీసులు పేర్కొన్నారు.
మరో హ్యాకర్‌తో కలిసి జూలై 2014 - జూలై 2015 మధ్య ఈ క్రోనోస్ మాల్‌వేర్‌ను డార్క్ వెబ్‌లో అమ్మి మార్కస్ లాభపడినట్లు తెలుస్తోంది. ఈ మాల్‌వేర్ ద్వారా కెనడా, జర్మనీ, పోలాండ్, ఫ్రాన్స్ దేశాల బ్యాంకు సర్వర్లు హ్యాక్‌కి గురైనట్లు, అందుకు మార్కస్ కారణమని లాస్ వేగాస్ కోర్టు ఆరోపించింది. మరోపక్క ఇతర భయంకర హ్యాకర్లను కట్టడి చేయడంలో మార్కస్ ప్రభుత్వానికి సహకరించాడని అతని తరఫు లాయర్ వాదించాడు. కేవలం మాల్‌వేర్‌ను తయారు చేసి, అమ్మడాన్ని నేరంగా పరిగణించి శిక్ష విధించడం సబబు కాదని కంప్యూటర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నేరానికి పాల్పడిన వాళ్లని పట్టుకోవడం చేతకాక మార్కస్ లాంటి కంప్యూటర్ హ్యాకర్‌ను అరెస్టు చేయడమేంటని హ్యాకర్ కమ్యూనిటీ ప్రశ్నిస్తోంది.