: విదేశీయలకు శాశ్వత నివాసం కల్పించడంలో ఖతార్ సంచలన నిర్ణయం!
దేశంలో తమ జనాభా కంటే అధికంగా ఉన్న విదేశీయులకు శాశ్వత నివాసంతో పాటు కొన్ని ప్రత్యేక హక్కులు కూడా కల్పించాలని ఖతార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు ప్రత్యేకంగా అక్కడ ఉన్న విదేశీయులకు గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు. విదేశీయులకు అతి తక్కువ ప్రాధాన్యతనిచ్చే గల్ఫ్ దేశాల్లో ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్న మొదటి దేశం ఖతార్. కార్డు కలిగి ఉన్న వారు ఖతార్ దేశస్తుల లాగే మనగలిగే అవకాశం ఉంటుంది. అలాగే అక్కడి ప్రభుత్వం సమకూర్చే అన్ని రకాల సౌకర్యాల్లోనూ వారికి భాగస్వామ్యం ఉంటుంది.
స్థానికుల తర్వాత ఆ దేశ మిలటరీలో, పౌర సంబంధ ఉద్యోగాల్లో కూడా వీరికి ప్రాధాన్యం కల్పించనున్నారు. స్థానిక భాగస్వామి లేకుండానే సొంతంగా వ్యాపారం పెట్టుకునే అవకాశం కూడా కల్పించనున్నారు. ఖతారీ మహిళలను పెళ్లి చేసుకున్న వారికి, దేశానికి అత్యవసరమైన విదేశీ ఉద్యోగులకు, అలాగే ఖతార్ కోసం కష్టపడిన విదేశీయులకు ఈ కార్డులు జారీ చేస్తారు. ఈ విధానం వల్ల ఖతార్లో పెట్టుబడి పెట్టే విదేశీ కంపెనీల సంఖ్య కూడా పెరిగే అవకాశముందని ఖతార్ అధికార మీడియా అభిప్రాయపడుతోంది.