: హాలీవుడ్ సినిమాను హైద్రాబాద్‌లో చేస్తా: రానా
విక్టరీ వెంకటేష్ అభిమానులున్నారనే ధైర్యంతోనే తాను సినీరంగంలోకి వచ్చానని, వాళ్ల అండ ఉంటే హాలీవుడ్ సినిమాను కూడా హైద్రాబాద్‌లో చేసేస్తానని దగ్గుబాటి రానా అన్నాడు. తాను నటించిన `నేనే రాజు నేనే మంత్రి` ప్రచార కార్యకమాల్లో ఆయన పాల్గొన్నాడు. తన తాత రామానాయుడిని తలచుకుని రానా వేదిక మీద ఉద్వేగానికి లోనయ్యాడు. సినిమా గురించి మాట్లాడుతూ తన తండ్రి సురేష్ బాబు ప్రొడక్షన్లో చేస్తున్న మొదటి సినిమా అని, అందుకు చాలా ఆనందంగా ఉందని రానా తెలిపాడు. తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం తన తాత రామానాయుడే అని, ఈ సినిమాను ఆయన చూడలేకపోతున్నారనే బాధ ఉందని, ఆయన లేని లోటు బాగా తెలుస్తుందని రానా చెప్పాడు. రానా తర్వాత మాట్లాడిన సురేష్ బాబు కూడా తండ్రిని తలుచుకుని కొంత ఉద్వేగానికి లోనయ్యారు. ఈ వేడుకలో వినూత్నంగా విక్టరీ వెంకటేష్ అభిమానుల భార్యలు, పిల్లల చేతుల మీదుగా సినిమాలోని ఓ పాటను విడుదల చేయించారు.