: తల్లి పాము వదిలేసిన గుడ్లను పొదిగే వరకు వాటిని కాపాడారు!
కేరళలోని కన్నూర్‌లోని కొట్టియూర్ పర్వత ప్రాంతం వద్ద ఉన్న తోటలో యజమానికి కింగ్ కోబ్రా కనిపించడంతో భయపడి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కి ఫోన్ చేశాడు. వాళ్లు పామును పట్టుకునేందుకు ప్రయత్నించగా అది పారిపోయింది. తర్వాత దాని గూడును, అందులో ఉన్న గుడ్లను... పాముని పట్టుకోవడానికి వచ్చిన చంద్రన్, విజయ్ నీలకంఠన్, గౌరి శంకరలు కనిపెట్టారు. కింగ్ కోబ్రాలు అత్యంత విషపూరితమైన పాములు కావడంతో ఆ గుడ్లను నాశనం చేద్దామని స్థానికులు సలహా ఇచ్చారు. అందుకు వాళ్లు ముగ్గురు అంగీకరించలేదు. అంతేకాకుండా అవి పొదిగే వరకు ఆగుదామని స్థానికులను ఒప్పించారు.
సాధారణంగా పాము పిల్లలు గుడ్డు నుంచి బయటికి రావడానికి 80 నుంచి 107 రోజులు పడుతుంది. పాము గుడ్లు పెట్టిన ప్రాంతానికి వీళ్లు ముగ్గురు నివసించే ప్రాంతానికి మధ్య 90 కి.మీ.ల దూరం ఉంటుంది. అయినా ప్రతి రోజు వచ్చి వాటిని చూసి వెళ్లేవారు. ఒకరి తర్వాత ఒకరు 24 గం.ల పాటు ఆ గుడ్లకు కాపలాగా ఉండేవారు. అలా 100 రోజుల పాటు వాటికి కాపలాగా ఉండి,గుడ్లు పొదిగిన తర్వాత ఆ పాము పిల్లలను ఊరికి దూరంగా వదిలేశారు. గుడ్ల నుంచి పాము పిల్లలు బయటికి వస్తుంటే చూడటం, పాముల పట్ల స్థానికులకు ఉన్న భయాన్ని పోగొట్టడానికి తాము పడిన శ్రమను మరిచిపోయేలా చేసిందని నీలకంఠన్ తెలియజేశారు.