: కమలహాసన్ ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదు: పెరంబలూరు జిల్లా కలెక్టర్
పెరంబలూరు జిల్లా కేంద్రంలోని ముత్తునగర్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద బడిపిల్లలకు కుళ్లిన కోడిగుడ్లు వడ్డించారని ప్రముఖ సినీనటుడు కమలహాసన్ కు ఆయన అభిమానులు తప్పుడు సమాచారం ఇచ్చారని కలెక్టర్ శాంత తెలిపారు. ఈ పాఠశాలలో కుళ్లిన కోడిగుడ్లు పిల్లలకు పెడుతున్నారంటూ కమల్ చేసిన ట్విట్టర్ ఆరోపణలపై ఆమె వివరణ ఇచ్చారు. కమల్ ఆరోపణలతో స్వయంగా తాను ఆ స్కూల్ కు వెళ్లి విచారించానని చెప్పారు.
అయితే అక్కడ అలాంటి దారుణం చోటుచేసుకోలేదని అన్నారు. ఆ బడికి నాణ్యమైన గుడ్లు సరఫరా అవుతున్నాయని ఆమె చెప్పారు. అయితే గుడ్లను నిల్వ చేసిన గదిలో వర్షం కారణంగా ఒక ట్రేలోని గుడ్లు తడిసిపోయాయని, వాటిని స్కూలు సిబ్బంది బయటపారబోశారని, వాటిని ఫోటోలు తీసిన కమల్ అభిమానులు తప్పుడు కధనాన్ని ఆయనకు వినిపించారని, దీంతోనే ఆయన అలా స్పందించి ఉంటారని చెప్పారు. కమలహాసన్ అంతటి వ్యక్తి అలా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని ఆమె చెప్పారు.