: 'జయ జానకి నాయక' నిర్మాత బెల్లంకొండకు బెదిరింపులు... పోలీసులకు ఫిర్యాదు
తన కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, బెల్లంకొండ సురేష్ నిర్మించిన తాజా చిత్రం 'జయ జానకి నాయక' విడుదలకు సిద్ధమైన వేళ, చిత్రానికి సంబంధించిన ఓ వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది. చిత్రానికి సంబంధించిన ఓ పాట షూటింగ్ సమయంలో లైటింగ్ ఏర్పాటు చేసిన వ్యక్తి, తనకు అదనపు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరిస్తున్నాడని సురేష్, బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
లైట్ల కోసం తాము ఓ వ్యక్తికి కాంట్రాక్టు ఇచ్చామని, పని ముగిసిన తరువాత రూ. 2.7 లక్షలు కట్టానని చెప్పిన సురేష్, కాంట్రాక్ట్ తనదని చెబుతూ అశోక్ రెడ్డి అనే వ్యక్తి రూ. 10.75 లక్షలు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాడని పోలీసులకు చెప్పాడు. తరచూ ఫోన్లు చేసి విసిగిస్తూ, తన పనులకు అడ్డుపడుతున్నాడని అన్నాడు. కాగా, గతంలో అశోక్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించి, తనకు సురేష్ రూ. 10.75 లక్షలు ఇవ్వాల్సి వుండగా, ఇవ్వడం లేదని కేసు పెట్టిన సంగతి తెలిసిందే. పోలీసులు ఈ రెండు కేసులనూ స్వీకరించి దర్యాఫ్తు చేస్తున్నారు.