: ఇక తప్పదు... బ్యాంకులను ఇరకాటంలోకి నెట్టిన ఆర్బీఐ!
నవంబర్ 2010 తరువాత అత్యంత తక్కువ స్థాయికి వడ్డీ రేటును చేర్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేశంలోని బ్యాంకులు ఇక రుణాలపై వడ్డీ రేటును తగ్గించక తప్పని పరిస్థితిని తెచ్చింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం ద్వారా రుణ లభ్యత సులభతరం కానుందన్న సంకేతాలను ఆర్బీఐ పంపింది. ఇటీవలి కాలంలో తగ్గుతూ వచ్చిన ద్రవ్యోల్బణానికి తోడు, జీఎస్టీ అమలు కారణంగా మార్కెట్ విలువ పెరగడం, కొత్త కంపెనీల రాక తదితర కారణాలతో వడ్డీ రేట్లు తగ్గితే, జీడీపీ మరింత వేగంగా వృద్ధి చెందుతుందని కూడా ఆర్బీఐ ఆలోచించింది.
ఇక ఇంతకాలమూ, ఆర్బీఐ వడ్డీని తగ్గిస్తే, ఆ ప్రయోజనాలను కస్టమర్లకు అందిస్తామని చెబుతూ వచ్చిన బ్యాంకుల ముందు ఇప్పుడు మరో ఆప్షన్ లేదు. గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై కనీసం పావు శాతం వరకూ వడ్డీ రేట్లను తగ్గించే దిశగా బ్యాంకులు నిర్ణయాలను ప్రకటించాల్సి వుంది. కాగా, అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తామిచ్చే రుణాలపై వడ్డీ రేటును తగ్గించకుండా, ప్రజల పొదుపు సేవింగ్స్ ఖాతాలపై తాను ఇవ్వాల్సిన వడ్డీని భారీగా... అంటే ఏకంగా అరశాతం తగ్గిస్తూ గత వారంలో నిర్ణయం తీసుకుంది. దీనిపై బ్యాంకు ఖాతాదారుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనగా, రుణాలపై వడ్డీని తగ్గించడం ద్వారా వారిలోని అసంతృప్తిని తగ్గించాలని ఎస్బీఐ భావిస్తోంది. ఈ మేరకు నేడో, రేపో నిర్ణయం వెలువడవచ్చని సమాచారం. దేశ బ్యాంకింగ్ రంగానికి పెద్దన్నగా ఉన్న ఎస్బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తే, మిగతా అన్ని బ్యాంకులు కూడా అదే దారిలో నడవాల్సి వస్తుంది.