: 'రైజ్' రెడీ... ఇండియన్ టెక్కీలకు మేలు కలిగించే నిర్ణయం తీసుకున్న డొనాల్డ్ ట్రంప్!


చట్ట బద్ధంగా వీసాలను పొంది అమెరికాలోకి ప్రవేశిస్తున్న వారి సంఖ్యను సగానికి తగ్గించాలని నిర్ణయించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నైపుణ్యవంతులైన ఇండియన్ టెక్కీలకు మేలు చేకూర్చే నిర్ణయాలు ప్రకటించారు. మెరిట్ ఆధారిత విధానం ద్వారా ఆంగ్ల భాషను అనర్గళంగా మాట్లాడే ఉద్యోగులకు రెసిడెన్సీ కార్డులు అధికంగా ఇవ్వాలన్న బిల్లుకు ఆయన మద్దతు పలికారు. ఇది భారత నిపుణులకు ఓ వరం వంటిదేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రైజ్ (రిఫార్మింగ్ అమెరికన్ ఇమిగ్రేషన్ ఫర్ స్ట్రాంగ్ ఎంప్లాయిమెంట్) పేరిట తయారైన ఈ బిల్లును యూఎస్ కాంగ్రెస్ ఆమోదిస్తే, చట్ట రూపంలోకి రానుంది.

యూఎస్ వీసాలకు అమలు చేస్తున్న ప్రస్తుత లాటరీ విధానం స్థానంలో మెరిట్ ఆధారిత కొత్త సిస్టమ్ అమలులోకి వస్తుంది. ఇక గ్రీన్ కార్డును పొందే విధానం కూడా మారిపోనుంది. పాయింట్ల ఆధారిత నూతన విధానంలో గ్రీన్ కార్డుల జారీ మొదలవుతుంది. చదివిన విద్య, వేతనం, పని చేస్తున్న కంపెనీ, ఆంగ్ల పరిజ్ఞానం, వయసు వంటి విషయాలపై పాయింట్లను ఇచ్చి అందుకు అనుగుణంగా గ్రీన్ కార్డులను జారీ చేసే విధానాన్ని కూడా రైజ్ లో పొందుపరిచారు.

ఇక ఈ చట్టానికి మద్దతు పలుకుతూ, వైట్ హౌస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్, "రైజ్ చట్టం అమల్లోకి వస్తే పేదరికం తగ్గుతుంది. వేతనాలు పెరుగుతాయి. పన్ను చెల్లింపుదారులకు బిలియన్ డాలర్ల కొద్దీ డబ్బు మిగులుతుంది. ఇతర దేశాల నుంచి వచ్చే వారికి ఇచ్చే అనుమతులు మరింత పారదర్శకంగా ఉండాలన్నదే మా అభిమతం. ఈ విధానంలో మరింత వేగంగా యూఎస్ పౌరసత్వం లభిస్తుంది" అన్నారు.

  • Loading...

More Telugu News