: పురుష అధికారులకు తప్పనిసరిగా రాఖీలు కట్టాలంటూ ఇచ్చిన ఆదేశాన్ని వెనక్కి తీసుకున్న డామన్, డయ్యు ప్రభుత్వం!
పురుష అధికారులకు మహిళా అధికారులు తప్పనిసరిగా రాఖీలు కట్టాలంటూ డామన్ అండ్ డయ్యు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలపై పురుష అధికారులు నిరసన వ్యక్తం చేశారు. దీనికి తోడు విషయం సోషల్ మీడియాకు ఎక్కడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్తువెత్తాయి. దీంతో వెనక్కి తగ్గిన కేంద్రపాలిత ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన 24 గంట్లోనే వెనక్కి తీసుకుంది.
ఆగస్టు 7న పనిచేస్తున్న ప్రదేశంలో రాఖీ పండుగను జరుపుకోవాలని ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. అధికారులు, సిబ్బంది అందరూ బహిరంగంగా ఈ వేడుక జరుపుకోవాలని అందులో పేర్కొంది. మహిళా సిబ్బంది పురుష సహచరులకు రాఖీలు కట్టాలంటూ డిప్యూటీ సెక్రటరీ (పర్సనల్) గుర్‌ప్రీత్ సింగ్ ఆగస్టు 1న ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు, ఆరోజు ఎవరూ డుమ్మాలు కొట్టడానికి వీల్లేదని కూడా పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉత్తర్వులపై సర్వత్ర విస్మయం వ్యక్తమైంది. రాఖీలు కట్టాలంటూ ప్రభుత్వం ఎలా ఆదేశిస్తుందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. తామెవరికి రాఖీ కట్టాలో ప్రభుత్వం ఎలా చెబుతుందంటూ మహిళా ఉద్యోగులు కూడా గళం విప్పారు. దీంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది.