: బీఎస్పీ చీఫ్ మాయావతికి బిగ్ షాక్.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన జాతీయ జనరల్ సెక్రటరీ సరోజ్!
బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఆ పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే ఇంద్రజీత్ సరోజ్ షాకిచ్చారు. మాయావతి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ పార్టీని వీడారు. సరోజ్ దళిత సామాజిక వర్గంలోని పాసి వర్గానికి చెందిన వారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రూ.9 లక్షల నుంచి రూ.22 లక్షలు తీసుకురావాలని మాయావతి ఆదేశించినట్టు ఆరోపించారు. అయితే అంత డబ్బును తాను తీసుకురాలేనని ఆమెకు తేల్చి చెప్పినట్టు తెలిపారు. తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని, అయితే పార్టీలోనే కొనసాగుతానని మాయాకు చెప్పినట్టు వివరించారు.
దీంతో ఆమె కోపంతో ఊగిపోయారని, పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం లేదని, పార్టీ వీడి వెళ్లిపోవాలన్నారని పేర్కొన్నారు. కౌషాంబి జిల్లాలోని మాంజాపూర్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సరోజ్, పార్టీని వీడడం బీఎస్పీకి పెద్ద ఎదురు దెబ్బేనని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో పాసి వర్గానికి 15-18 శాతం ఓటు బ్యాంకు ఉంది. సరోజ్ పార్టీని వీడడంతో ఈ వర్గం ఓట్లు బీఎస్పీకి పడే అవకాశం లేదని చెబుతున్నారు.