: వైరల్ పోస్టు... దుబాయ్ లో స్థిరపడిన భారతీయుల్లో పెనుకలకలం రేపిన యువతి బహిరంగ లేఖ!


ఒక యువతి రాసిన బహిరంగ లేఖ గల్ఫ్ దేశాలకు పొట్ట చేతబట్టుకుని వెళ్లిన ప్రవాస భారతీయులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంగీతా భాస్కరన్ అనే యువతి రాసిన ఆ లేఖ వివరాల్లోకి వెళ్తే... ‘‘దుబాయికి వలస వెళ్లిన మొదటి తరం భారతీయుల్లో మా నాన్న కూడా ఒకరు. కర్ణాటకలోని బెంగళూరు మా స్వస్థలం. జేబులో ఒక్క రూపాయి కూడా లేకుండా దుబాయికి వచ్చిన ఆయన, ఓ కంపెనీలో కార్మికుడిగా చేరారు. పైసా పైసా కూడబెట్టి చేసిన అప్పులన్నీ తీర్చేశారు. ఆ తరువాత మా కుటుంబం మొత్తాన్ని దుబాయ్ తీసుకొచ్చారు. అలా దుబాయ్ కు చేరేసరికి నేను చాలా చిన్నపిల్లను, నా బాల్యం అంతా ఇక్కడే గడిచింది.

 నా తీపి గుర్తులన్నీ ఇక్కడే, ఎన్నో మధురజ్ఞాపకాలను దుబాయ్ నాకు ఇచ్చింది. నింగినంటే బుర్జ్‌ ఖలీఫా, అహ్లాదకరమైన థీమ్ పార్కులు, బీచ్... ఇలా ఒకటేమిటి, అక్కడ దొరికే స్వీట్ టీ సహా అన్నీ నాకు చాలా ఇష్టం. పెరిగిపెద్దయ్యాను. ఒక కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తున్నాను. 2012లో మా నాన్న పని చేసే కంపెనీ ఆయన చేతిలో ఒక లేఖ పెట్టింది. దానిని తీసుకున్న ఆయన ఆఫీసులో ఉన్న నన్ను అర్జెంటుగా రమ్మన్నారు. వెంటనే సెలవు పెట్టి ఇంటికి చేరాను. అప్పటికే చెల్లి, అమ్మ ఇంటికి చేరుకున్నారు. అంతా ఏదో బాధతో దీర్ఘాలోచనలో మునిగి ఉన్నారని అనిపించింది. నాన్న ఎదురుగా కుర్చీలో కూర్చోగానే ఆయన నా చేతిలో ఓ కాగితం పెట్టి చదవమన్నారు.

దానిని చదువుతుంటే నా గుండెను ఎవరో పిండేసినట్లు అనిపించింది. కళ్లవెంట నీరు ఆగడం లేదు. ‘నీ సేవలు మా కంపెనీకి ఇక అవసరం లేదు. నిన్ను ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నాం. 30 ఏళ్లకు పైగా మా సంస్థకు సేవలు అందించినందుకు కృతజ్ఞతలు. త్వరలోనే రాజీనామా పత్రాన్ని సమర్పించగలరు. లేకుంటే గడువు ముగిశాక మేమే ఉద్యోగం నుంచి తొలగించాల్సి ఉంటుంది. దయచేసి గమనించగలరు’ ఇదీ ఆ లేఖ సారాంశం. నిత్యం పని పని అని కలవరించే నాన్నకు పని చేయగల సామర్థ్యమున్నా విధుల నుంచి తొలగిస్తున్నారని అర్థమైంది. దీంతో నాన్న రాజీనామా చేసి, దుబాయ్ లో ఉండేందుకు వర్క్ వీసాను పేరెంట్ వీసాగా మార్చి, నన్ను నామినీగా పెట్టుకున్నారు. అప్పుడు ఆలోచనలో పడ్డాను.

 30 ఏళ్ల క్రితం భారత్ నుంచి వచ్చి, దుబాయ్ లోని ఎత్తైన కట్టడాల నిర్మాణంలో భాగమైన మా నాన్నకు ఈ దుస్థితి ఎందుకొచ్చింది? దుబాయ్ లో ఎన్నేళ్లున్నా ఇంతేనా? దుబాయ్ అభివృద్ధిలో భాగం అయిన మాకు, మాలాంటి వారికి ఇక్కడే ఉండే అర్హత లేదా? అని ప్రశ్నించుకున్నాను. అంతే, స్థిరమైన నిర్ణయం తీసుకున్నాను. మా నాన్న లాంటి పరిస్థితి రేపు నాకు, నా పిల్లలకు రాకూడదని గట్టిగా అనుకున్నాను. అందుకే వెంటనే నా దేశం వెళ్లాలని నిర్ణయించుకున్నాను. నా కుటుంబాన్ని ఒప్పించి 2017 జూలై 23న శాశ్వతంగా దుబాయ్ ని వదిలేసి, స్వదేశం చేరుకున్నాను. తీపిజ్ఞాపకాలిచ్చిన దుబాయ్ ను వదిలి, కొత్త ఆశలు, భవిష్యత్ పై నీలినీడలతో గుండె దిటవు చేసుకుని భారత్ చేరిన నేను... నా మనసులోని భావాలు వ్యక్తం చేయాలనిపించి ఈ లేఖ రాస్తున్నా’ అంటూ పేర్కొన్నారు. ఈ లేఖ సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషనగా ఆకట్టుకుంటోంది. 

  • Loading...

More Telugu News