: దుష్ప్రచారం చేసే వాళ్లు అలా చేస్తూనే ఉంటారు: నారా లోకేశ్
అభివృద్ధి విషయంలో రాయలసీమను తామెప్పుడూ చిన్నచూపు చూడలేదని, నిర్లక్ష్యం చేయలేదని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అన్ని జిల్లాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని అన్నారు. ‘దుష్ప్రచారం చేసే వాళ్లు చేస్తూనే ఉంటారు. ఇటీవల ఓ దుష్ప్రచారం చేశారు! 50 ఏళ్ల వయసు పైబడిన వారిని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి పంపించి వేస్తున్నామని ప్రచారం చేశారు.
అసలు ఈ విషయమై ఓ జీవో, డిస్కషన్... ఇలా ఏదీ జరగలేదు. ఎటువంటి ఆధారమూ లేకుండానే దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంగ్లీషులో ఓ సామెత ఉంది.. ‘కన్వెన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయండి’ అని. అటువంటి పనులు చేస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ను తీసేస్తున్నామంటూ మొన్న దుష్ప్రచారం చేశారు. అసలు, నాకే అర్థం కాలేదు. ఈ అంశంపై చర్చ ఎక్కడ జరిగింది? ఎవరితో మాట్లాడారు? అసలు, మా పార్టీకి ఈ ఆలోచనే రాలేదు’ అని లోకేశ్ చెప్పుకొచ్చారు.