: మోహన్‌లాల్ సినిమా ద్వారా శ్రీకాంత్, విశాల్, హన్సిక, రాశి ఖన్నాల మాలీవుడ్ ఎంట్రీ!
మోహన్‌లాల్ `విలన్` సినిమా ద్వారా తెలుగు నటుడు శ్రీకాంత్, తమిళ నటుడు విశాల్, హీరోయిన్లు హన్సిక, రాశి ఖన్నాలు మలయాళ చిత్రపరిశ్రమలో అడుగు పెట్టబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్‌లను చిత్ర దర్శకుడు బి. ఉన్నికృష్ణన్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో విడుదల చేశాడు. శక్తివేల్ పళనిస్వామి అనే పాత్రను విశాల్, ఫెలిక్స్ డి విన్సెంట్ అనే పాత్రను శ్రీకాంత్, శ్రేయ అనే పాత్రను హన్సిక, హర్షిత చోప్రా అనే పాత్రను రాశి ఖన్నా పోషిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.
వీరందరూ కలిసి మోహన్ లాల్ పోషించే మాథ్యూ మంజూరన్ అనే పాత్రను ఎదుర్కుంటారని ఉన్నికృష్ణన్ పేర్కొన్నారు. వీరిలో విశాల్ ప్రధాన ప్రతినాయకుని పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. హన్సికది గాయని పాత్ర అని, రాశి ఖన్నాది అవినీతి పోలీసాఫీసర్ పాత్ర అని సమాచారం. కాగా, శ్రీకాంత్ పాత్రకు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలియరాలేదు. ఈ సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.