: తదుపరి చిత్రం కోసం నాసాలో శిక్షణ పొందుతున్న సుషాంత్ సింగ్ రాజ్‌పుత్
`ధోని` సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ తన తదుపరి చిత్రం `చందమామ దూర్ కే` కోసం అమెరికా అంతరిక్ష కేంద్రం నాసాలో శిక్షణ పొందుతున్నారు. ఇప్పటికే గురుత్వాకర్షణ శక్తి లేని పరిస్థితుల్లో జీవించడం, వ్యోమగాముల జీవన విధానాలపై ఆయన శిక్షణ పొందుతున్నారు. ఈ విషయాన్ని సుషాంత్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం సుషాంత్ అమెరికాలోని హంట్స్‌విల్లే ప్రాంతంలో ఉన్న యూఎస్ స్పేస్ అండ్ రాకెట్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్నారు.
కాగా, సైన్స్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, మాధవన్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చరిత్ర మరుగున పడిపోయిన ఓ గొప్ప వ్యక్తిని ఈ సినిమా పరిచయం చేస్తుందని గతంలో మాధవన్ అన్నారు. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.