: కోట్ల ఆఫర్ ఇవ్వలేదు... హర్షిత్ గురించి అసలు తెలియదు!: గూగుల్ వివరణ
చండీగఢ్ కు చెందిన ఇంటర్ చదివిన 16 ఏళ్ల విద్యార్థి హర్షిత్ శర్మకు గూగుల్, తన డిజైనింగ్ టీమ్ లో సాలీనా రూ. 1.44 కోట్ల ఆఫర్ తో ఉద్యోగాన్ని ప్రకటించింది... గత వారంలో సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అయిన న్యూస్ ఇది. ఇప్పుడా వార్త ఫేక్ అని గూగుల్ తేల్చింది. అసలు తమ వద్ద హర్షిత్ శర్మకు చెందిన రికార్డులేవీ లేవని, అతనికి ఆఫర్ ఇవ్వలేదని స్పష్టం చేసింది.
కాగా, డిజైనింగ్ రంగంలో ఉపాధి పొందుతున్న హర్షిత్ ను గూగుల్ ఎంపిక చేసుకుని, నెలకు నాలుగు లక్షల రూపాయల ఉపకార వేతనంతో ఆగస్టులో అమెరికాకు పంపి శిక్షణ ఇవ్వనుందని, ఏడాది తరువాత నెలకు రూ. 12 లక్షల ఆఫర్ తో ఉద్యోగాన్ని ఆఫర్ చేసిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని హర్షిత్ స్వయంగా మీడియాకు చెప్పి తన కల నిజమైందని అన్నాడు కూడా. ఇప్పుడు గూగుల్ వివరణతో మీడియాలో కనిపించేందుకే ఇలా తప్పుడు సమాచారాన్ని అతడు ఇచ్చినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.