: బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే ఇండస్ట్రీలో చాలా కష్టం: సోనూసూద్
ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిత్రసీమకు వచ్చి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న హీరో సోనూసూద్. తనలా ఇండస్ట్రీకి వచ్చే వాళ్లు ఇక్కడ చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, వాటన్నిటికీ సిద్ధపడ్డ తర్వాతే ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని సోనూసూద్ సూచిస్తున్నాడు. ఇటీవల నిర్మాతగా మారి కొత్త వాళ్లకు అవకాశం కల్పిస్తున్న ఆయన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కున్న ఇబ్బందుల గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
తాను వచ్చిన కొత్తలో సినిమాలో స్థిర గుర్తింపు తెచ్చుకున్న వాళ్లు చాలా భేదభావం చూపించేవారని, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడంతో తనతో కలవడానికి గానీ, మాట్లాడటానికి గానీ వాళ్లు ముందుకు వచ్చేవారు కాదని వివరించాడు. ఆ సమయంలో మంచి గుర్తింపు తీసుకురాగలిగే పాత్రలు వస్తే బాగుండునని అనుకునే వాడినని, సరైన అవకాశం కోసం ఇబ్బందులు భరిస్తూ వేచి చూడడం కష్టంగా ఉండేదని సోనూసూద్ తెలిపాడు. మనపై మనం నమ్మకం ఉంచుకుని, ఇలాంటి కష్టాలను అవకాశాలుగా మార్చుకుని, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని సోనూసూద్ చెప్పాడు.