: ఉగ్రవాది శవాన్ని తీసుకెళ్లండి... పాక్ హైకమిషన్ ను తొలిసారిగా కోరిన భారత్!
జమ్మూ కాశ్మీర్ లో పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించిన లష్కరే తోయిబా ఉగ్రవాది అబూ దుజానా మృతదేహాన్ని తీసుకు వెళ్లాలని ఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్ ను భారత్ కోరింది. ఓ ఉగ్రవాది శవాన్ని క్లయిమ్ చేసుకోవాలని భారత అధికారులు పాక్ ను కోరడం ఇదే తొలిసారి. పాక్ హై కమిషన్ కార్యాలయానికి వచ్చిన కాశ్మీర్ ఐజీపీ మునీర్ ఖాన్, దుజానా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని గిల్గిత్ బిల్టిస్తాన్ ప్రాంతానికి చెందిన వాడని, అతని మృతదేహాన్ని తీసుకెళ్లాలని కోరారు.
ఆపై ఖాన్ మీడియాతో మాట్లాడుతూ, దుజానా మృతదేహాన్ని పాక్ అధికారులు తీసుకెళ్లకుంటే, తామే అంత్యక్రియలు పూర్తి చేస్తామని అన్నారు. దుజానా తల్లిదండ్రులు తమ కుమారుడిని చివరి సారి చూస్తారన్న ఉద్దేశంతోనే మృతదేహాన్ని క్లయిమ్ చేసుకోవాలని కోరినట్టు ఆయన తెలిపారు. ఇక శవాన్ని అంత్యక్రియల నిమిత్తం కాశ్మీర్ లో ఎవరికీ అప్పగించేది లేదని ఆయన స్పష్టం చేశారు. స్థానికులకు అతని శరీరాన్ని అప్పగించబోమని అన్నారు. కాగా, దుజానాతో పాటే హతుడైన మరో ఎల్ఈటీ ఉగ్రవాది ఆరిఫ్ లాలిహారీ అంత్యక్రియలు లోయలో జరుగగా, వందలాది మంది యువత హాజరై భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.