: మరో అద్భుతం.. ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ కింద రైల్వే టన్నెల్!
చైనా దేశం మరో అద్భుత ఆవిష్కరణకు వేదిక కానుంది. 2022 వింటర్ ఒలింపిక్స్ ఈ దేశంలోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 12 కిలో మీటర్ల పొడవు గల హై స్పీడ్ ట్రెయిన్ టన్నెల్ ను నిర్మించనుంది. అదీ కూడా, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ ఉన్న బాడ్లింగ్ ప్రాంతంలో దీనిని నిర్మించనున్నారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉన్న ప్రాంతంలో సందర్శకులు అత్యధికంగా పర్యటించే ప్రదేశం బాడ్లింగ్. ఈ క్రమంలో హై స్పీడ్ ట్రెయిన్ టన్నెల్ నిర్మాణ పనుల్లో ఆ దేశ ఇంజనీర్లు సంబంధిత పనుల్లో తలమునకలై ఉన్నట్టు ‘పీపుల్స్ డెయిలీ’ పేర్కొంది. గంటకు 350 కిలో మీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేందుకు వీలుగా ఈ టన్నెల్ ను నిర్మించనున్నారు. 2019లో ఈ టన్నెల్ నిర్మాణం పూర్తి కానున్నట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా బీజింగ్ హై స్పీడ్ రైల్వే లైన్ చీఫ్ ఇంజనీర్ లూ దుహా మాట్లాడుతూ, ఈ టన్నెల్ నిర్మాణానికి మైక్రో బ్లాస్టింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని, ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగించి బ్లాస్ట్ ల ప్రభావం గ్రేట్ వాల్ ఆఫ్ చైనాపై పడదని, ఆ నిర్మాణానికి ఎటువంటి ప్రమాదం ఉండదని అన్నారు. అయితే, పర్యావరణానికి స్వల్పంగా ముప్పు వాటిల్లుతుందని బీజింగ్- ఝాంగ్జాక్ హై స్పీడ్ రైల్వే లైన్ డిప్యూటీ మేనేజర్ డాయి లాంగ్జెన్ పేర్కొన్నారు.
టన్నెల్ నిర్మాణం నిమిత్తం ఓ సారి బ్లాస్ట్ జరిగిన సందర్భంలో తాను గ్రేట్ వాల్ ఆఫ్ చైనాపై నిలబడి ఉన్నానని, బ్లాస్ట్ జరిగినట్టుగా తనకు ఎటువంటి భావన కలగలేదని అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు టన్నెల్ నిర్మాణం నిమిత్తం సుమారు 4,500 సార్లు బ్లాస్ట్ లు జరిగాయని నిర్మాణ ప్రాంతంలో ఉన్న బ్లాస్ట్ నిపుణుడు ఝాంగ్ జ్యుహా చెప్పారు. టన్నెల్ మధ్య భాగంలో విశాలమైన, అందమైన తీరులో రైల్వేస్టేషన్ ను నిర్మించనున్నారని జిన్హా వార్తా సంస్థ పేర్కొంది. 36,000 స్క్వేర్ మీటర్ల ప్రాంతంలో అత్యంత విశాలంగా నిర్మిస్తున్న ఈ నిర్మాణం చరిత్ర సృష్టిస్తుందని, బాడ్లింగ్ ప్రాంతానికి 102 మీటర్ల దిగువన ఈ స్టేషన్ ను నిర్మిస్తున్నట్టు తెలిపింది.