: మరోసారి హెచ్చరికలు జారీ చేసిన చైనా అధ్యక్షుడు
గత కొన్ని రోజులుగా చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది. అవసరమైతే యుద్ధానికైనా రెడీ అంటూ సమరనాదం చేస్తోంది. తాజాగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తన శత్రు దేశాలకు మరో హెచ్చరిక జారీ చేశారు. తమ దేశ సార్వభౌమత్వం, భద్రత విషయంలో ఏ మాత్రం రాజీ పడబోమని ఆయన అన్నారు. తమ భూభాగాన్ని ఆక్రమించుకోవాలని అనుకుంటున్న శక్తులను ఓడించే ఆత్మవిశ్వాసం తమకు ఉందని తెలిపారు.
చైనాను ఎట్టి పరిస్థితుల్లో విచ్ఛిన్నం కానివ్వమని, దురాక్రమణకు ప్రయత్నించే ఏ వ్యక్తిని కాని, వ్యవస్థను కాని, రాజకీయ పార్టీని కాని సహించబోమని, వారి ప్రయత్నాలను విఫలం చేస్తామని చెప్పారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 90వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నేడు నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు.
సిక్కిం సెక్టార్ లో భారత్-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చైనా ప్రజలు స్వతహాగా శాంతికాముకులని... తమ దేశాన్ని విస్తరించుకోవాలని కాని, దురాక్రమణలకు పాల్పడాలని కాని చైనీయులు ఎన్నడూ కోరుకోరని... అయితే, తమ భూభాగాన్ని ఆక్రమించుకోవాలని భావించే వారిని ఓడించే సత్తా మాత్రం తమకు ఉందని జిన్ పింగ్ అన్నారు. గత మూడు రోజుల్లో ఇలాంటి హెచ్చరికలను ఆయన చేయడం ఇది రెండోసారి.