: కరుడుగట్టిన ఉగ్రవాదిని ఏరిపారేసిన సైన్యం... కశ్మీర్ లష్కరే చీఫ్ అబు దుజానా హతం
తలపై పది లక్షల రూపాయల రివార్డు ఉన్న ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఘటన వివరాల్లోకి వెళ్తే... పుల్వామా జిల్లాలోని హక్రీపోరా గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో వేకువజామునే భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఆ గ్రామ పరిసరాల్లో భద్రతా సిబ్బంది కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. దీంతో ముప్పు గమనించిన ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిపై కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు ప్రారంభించారు.
ఈ క్రమంలో లష్కర్ కమాండర్ ఆరిఫ్ ను తొలుత మట్టుబెట్టారు. అనంతరం కశ్మీర్ లష్కరే తాయిబా చీఫ్ అబు దూజానాను హతమార్చారు. అబు దూజానాపై పది లక్షల రివార్డు ఉండడం విశేషం. కశ్మీర్ లో అల్లర్లు, మారణహోమానికి కారణం అబు దూజానా అని భద్రతాధికారులు పేర్కొంటున్నారు. కాగా, ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.