: ఇంకా జగన్ పిలవలేదు: శిల్పా చక్రపాణిరెడ్డి
తాను తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి వైఎస్ఆర్ సీపీలో చేరనున్నానంటూ వచ్చిన వార్తలపై ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి స్పందించారు. ఆ పార్టీ నాయకుల నుంచి తనకు ఆహ్వానం అందిన మాట నిజమేనని, ఇంకా వైఎస్ జగన్ నుంచి మాత్రం ఎలాంటి ఆహ్వానమూ అందలేదని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం హైకమాండ్, ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తూ, తనవంటి వారిని పట్టించుకోవడం లేదని విమర్శించిన ఆయన, పలు అధికారిక కార్యక్రమాలకు కూడా తనను ఆహ్వానించడం లేదని వాపోయారు. సుదీర్ఘకాలంగా తన వెంట నడుస్తున్న కార్యకర్తల మనోభావాలను తెలుసుకోనున్నానని, వారితో సమావేశం తరువాత తుది నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు.