: ఆ సినీ ప్రముఖులందరికీ నోటీసులు ఎందుకు ఇవ్వకూడదు?: రామ్ గోపాల్ వర్మ
డ్రగ్స్ వ్యవహారంలో సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసినప్పటి నుంచి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రచ్చ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. సాక్షాత్తు ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ను కూడా ఆయన వదల్లేదు. తాజాగా ఆయన సినీ రంగ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇటీవల నిర్వహించిన యాంటీ డ్రగ్స్ ర్యాలీకి ఒకరిద్దరు మినహా సినీ ప్రముఖులు ఎవరూ హాజరుకాలేదు. దీంతో, వారిపై వర్మ నిప్పులు చెరిగారు. యాంటీ డ్రగ్ ర్యాలీకి హాజరుకాని సినీ ప్రముఖులు ఏదో ఒక రూపంలో డ్రగ్స్ కు కనెక్ట్ అయ్యారా? అనే సందేహాన్ని వర్మ వ్యక్తపరిచారు. యాంటీ డ్రగ్ మూమెంట్ కు మద్దతు ఇవ్వకుండా ఉన్న సినీ ప్రముఖులకు నోటీసులు ఎందుకు జారీ చేయకూడదని ఆయన ప్రశ్నించారు. చివర్లో... 'జస్ట్ అడుగుతున్నానంతే' అంటూ ముగించారు. తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా వర్మ ఈ మేరకు విమర్శలు గుప్పించారు.