: పాయింట్ పడుద్ది... నేటి నుంచి హైదరాబాదులో సరికొత్త ట్రాఫిక్ విధానం అమలు!


హైదరాబాదులో నేటి నుంచి సరికొత్త ట్రాఫిక్ విధానం అమలులోకి రానుంది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనను బట్టి పాయింట్లను కోతవేయనున్నారు. 12 పాయింట్లు దాటితే లైసెన్స్ రద్దు చేస్తారు. మద్యం తాగి ప్రజా రవాణా వాహనాలు నడిపితే 5 పాయింట్లను విధిస్తారు. దోపిడీలు, స్నాచింగ్ లకు వాహనాలు వినియోగిస్తే 5 పాయింట్లు విధిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనాలు వ్యక్తుల మరణానికి కారణమైతే 5 పాయింట్లను విధిస్తారు. మద్యం తాగి కార్లు, భారీ వాహనాలు నడిపితే 4 పాయింట్లను విధించనున్నారు. తాగి బైక్ నడిపితే 3 పాయింట్లు, అలాగే 40 కిలోమీటర్ల వేగాన్ని మించితే 3 పాయింట్లు విధిస్తారు.

రేసింగ్ లో పాల్గొన్నా, మితిమీరిన వేగంతో వెళ్తున్నా 3 పాయింట్లు, నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో ప్రయాణికులను తరలిస్తే 2 పాయింట్లు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కు 2 పాయింట్లు, వాయు, శబ్దకాలుష్యం వెదజల్లే వాహనాలకు 2 పాయింట్లు, వాహనాలకు సరైన పత్రాలు లేకుండా డ్రైవింగ్ చేస్తే 2 పాయింట్లు విధిస్తారు. రోడ్డు ప్రమాదంలో బాధితులు గాయాలపాలైతే రెండు పాయింట్లు విధించనున్నారు. ఆటోడ్రైవర్లు తమ పక్కన ప్రయాణికులను కూర్చోబెట్టుకుంటే ఒక పాయింట్ విధిస్తారు. సీట్ బెల్టు లేదా హెల్మెట్ పెట్టుకోని పక్షంలో కూడా ఒక పాయింట్ విధిస్తారు. ఇలా మొత్తం 12 పాయింట్లు అయితే వారి లైసెన్స్ రద్దు చేస్తారు.

  • Loading...

More Telugu News