: భాజపా అధ్యక్షుడిగానే ఉంటా... మంత్రి పదవిపై స్పష్టత ఇచ్చిన అమిత్ షా!
కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా అమిత్ షా కేబినెట్‌లోకి వస్తారంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. భాజపా అధ్యక్షుడిగా తాను చాలా సంతృప్తిగా ఉన్నానని, ఇలాగే కొనసాగాలనుకుంటున్నానని ఆయన స్పష్టం చేశారు. రాజ్యసభకు ఎన్నికైనా కూడా ఇదే పదవిలో ఉండటానికి ఇష్టపడతానని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆయనకు మంత్రి వర్గంలో కీలకమైన రక్షణ మంత్రి పదవిని ఇస్తారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.
గుజరాత్ నుంచి అమిత్ రాజ్యసభకు పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ వార్తలు వచ్చాయి. అలాగే కేశవ్ ప్రసాద్ మౌర్య మీద వస్తున్న ఊహాగానాలకు కూడా ఆయన తెర తీశారు. కేశవ్ కూడా యూపీ ఉపముఖ్యమంత్రి పదవిలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. దీంతో గుజరాత్ ప్రభుత్వంపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను, బిహార్ మహాకూటమి విచ్ఛిన్నం గురించి వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. నితీశ్ రాజీనామా చేసిన తర్వాతే భాజపా ఆయనకు మద్దతిచ్చిందని పేర్కొన్నారు.