: వెంటనే రష్యా విడిచి వెళ్లండి... 755 మంది అమెరికా ఉన్నతాధికారులకు పుతిన్ తాఖీదు!


అమెరికా, రష్యాల మధ్య స్నేహబంధం బలహీనమౌతున్న వేళ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రష్యాలో అమెరికా తరఫున దౌత్యాధికారులుగా పని చేస్తున్న 755 మందిని వెంటనే దేశం వీడి స్వదేశానికి పయనమవ్వాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల రష్యాపై ఆంక్షలను విధిస్తూ, అమెరికా తీసుకున్న నిర్ణయానికి ప్రతిగానే పుతిన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్టు తెలుస్తోంది. గతంలో పదుల సంఖ్యలో ఉన్నతాధికారులను ఇరు దేశాలూ వెనక్కు పంపిన సందర్భాలుండగా, ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో దౌత్యాధికారులను వెళ్లిపోవాలని కోరడం ఇదే తొలిసారి.

ఇక రష్యాలో ఉండే అమెరికా దౌత్యాధికారులు, సాంకేతిక నిపుణుల సంఖ్యను 455కు కుదించాలని కూడా నిర్ణయించినట్టు పుతిన్ పేర్కొన్నారు. ప్రస్తుతం రష్యాలోని అమెరికన్ ఎంబసీల్లో 1,200 మంది వరకూ అమెరికన్లు పని చేస్తున్నారు. రష్యాను అస్థిరత్వంలోకి నెట్టేలా అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపించిన పుతిన్, ఆ పరిస్థితిని రానివ్వబోమని, తమ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని వెల్లడించారు. అమెరికా తన వైఖరిని మార్చుకోవాలని పుతిన్ హితవు పలికారు.

  • Loading...

More Telugu News