: సదస్సులో 'ప్లకార్డు' ప్రదర్శించిన పవన్ కల్యాణ్... పవన్ తదుపరి పోరు ఆ సమస్యపైనేనా?
ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్టణంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ, జనసేన కలసి సంయుక్తంగా ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారం కోసం నిర్వహించిన సింపోజియంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉద్ధానం కిడ్నీ బాధితులు, నల్గొండ ఫ్లోరైడ్ బాధితుల సమస్యలను ప్రస్తావించిన పవన్ కల్యాణ్... ప్రసంగం చివర్లో ఒక ప్లకార్డును ప్రదర్శించారు. ఆ సందర్భంగా ఆయన మౌనంగా చిరునవ్వులు చిందించారు.
ఆ ప్లకార్డులో 'జనావాసాల మధ్య బ్రాంది షాపు పెట్టరాదు' అనే క్యాప్షన్ ఉంది. ఏపీలోని సరికొత్త మద్యం పాలసీలో భాగంగా వివిధ ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు లైసెన్సులు ఇస్తున్నారని, అవి జనావాసాల మధ్య ఉండడంతో మద్యం దురలవాటు కారణంగా కుటుంబాలు నాశనమైపోతున్నాయని ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఈ ప్లకార్డు ప్రదర్శించడం ఆసక్తి రేపుతోంది. జనసేన తరువాత పోరాటం దానిపైనేనని ఆయన పరోక్షంగా చెప్పారని పలువురు పేర్కొంటున్నారు.