: శత్రువులందరినీ ఓడించే సత్తా మాకుంది: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్య
సరిహద్దుల్లో చొచ్చుకువచ్చే పొరుగు దేశాల సైన్యం సహా, తమ సార్వభౌమత్వానికి ఎదురు నిలిచే శత్రువులందరినీ ఓడించే సత్తా తమకుందని చైనా అధ్యక్షుడు క్సీ జిన్ పింగ్ వ్యాఖ్యానించారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉందని ఆయన అన్నారు. సుమారు 23 లక్షల మంది సైన్యాన్ని కలిగివున్న చైనా, 90వ సైనిక దినోత్సవాలను వైభవంగా నిర్వహించుకోగా, భారీ మిలటరీ పెరేడ్ ను ఉద్దేశించి జిన్ పింగ్ మాట్లాడారు. తమది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మీ అని, తమ జవాన్లకు ఎవరినైనా ఓడించగలమన్న నమ్మకం ఉందని అన్నారు. ఈ విషయంలో ఎటువంటి సందేహాలకూ తావు లేదని తెలిపారు.
కాగా, భారత్, చైనా సరిహద్దుల్లోని సిక్కిం సెక్టారులోని డోక్లాం సమీపంలో ఇండియా - చైనా సైన్యాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో జిన్ పింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గడచిన నెల రోజులుగా ఈ ప్రాంతంలో ఇరు వైపులా సైన్యాలు మోహరించి వుండగా, సమస్య పరిష్కారం దిశగా ఇంతవరకూ ఎటువంటి చర్చలూ మొదలు కాలేదన్న సంగతి తెలిసిందే. తమ సత్తాను పరిచయం చేస్తూ, ఇటీవల చైనా సైన్యం పలు రకాల లైవ్ డ్రిల్స్ కూడా ఈ ప్రాంతంలో చేపట్టింది. ప్రతిగా భారత సైన్యం కూడా విన్యాసాలు చేపట్టింది. చైనా తన అమ్ములపొదిలోని లాంగ్ రేంజ్ న్యూక్లియర్ మిసైల్స్ తో పాటు కన్వెన్షనల్ మిసైళ్లను, సరికొత్త జే-15 యుద్ధ విమానాలనూ డోక్లాంకు సమీప ప్రాంతాలకు చేరుస్తున్న వేళ, ఇండియా కూడా అత్యాధునిక క్షిపణులను, యుద్ధ విమానాలనూ సిద్ధం చేస్తుండటంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొని వుంది.