: నవాజ్ షరీఫ్ అనర్హత వేటు... భారత్‌పై ప్రభావం!
పాకిస్థాన్‌లో ప్రధాని నవాజ్ షరీఫ్‌పై అనర్హత వేటు విధించడం, తద్వారా అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలపై భారత్ పెద్దగా దృష్టి సారిస్తున్నట్లు కనిపించడం లేదు. కాకపోతే నవాజ్ తర్వాత ఎవరు ప్రధాని స్థానాన్ని అదిష్టిస్తారనే విషయాన్ని మాత్రం భారత్ ఓ కంట కనిపెడుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లో రాజకీయ అస్థిరత ఏర్పడటం గురించి భారత్‌కు తెలియంది కాదు. అయినప్పటికీ వాళ్ల అధికార ప్రభుత్వ విధివిధానాల ఆధారంగానే ఇక్కడ కొన్ని రక్షణ సంబంధ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అక్కడి ప్రభుత్వం, మిలటరీ కనుసన్నల్లో పనిచేసేదైతే భద్రత పరమైన రక్షణను భారత్ కట్టుదిట్టం చేయాల్సి ఉంటుంది.
ఇక విదేశాంగ విధానాల విషయంలో ప్రస్తుతం పాక్‌కి, అమెరికాకు పెద్దగా పడటం లేదు. కానీ చైనా, రష్యాలు పాకిస్థాన్ కొమ్ముకాస్తున్నాయి. భారత్‌కు ఎలాగూ పాక్‌తో ప్రత్యక్ష విదేశీ సంబంధాలు లేవు. దీంతో అక్కడ రాబోయే ప్రభుత్వ విదేశాంగ విధానం పరోక్షంగా భారత విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఒకప్పుడు పాక్ మాజీ ప్రధాని షరీఫ్‌పై నరేంద్రమోదీకి నమ్మకం ఉండేది. కానీ పఠాన్‌కోట్, యూరీ ఘటనల తర్వాత ఆ నమ్మకం పోయింది. ఈ నేపథ్యంలో నవాజ్ సంబంధీకులు ప్రధాని పదవిలో కూర్చున్నా భారత్‌కు పెద్దగా ఒరిగేదేం ఉండదు. అంతేకాకుండా ఆ దేశం ఆర్థిక లోటు, ఉగ్రవాద సమస్యలతో కొట్టుమిట్టాడుతూనే ఉంది. దీని వల్ల భారత్‌కు అక్కడి అధికార నాయకత్వం కంటే పాకిస్థాన్ మిలటరీతోనే సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగని పాక్ ఆర్మీ, భారత్‌తో ప్రత్యక్ష చర్చలకు దిగేందుకు సిద్ధంగా లేదు. వారెప్పుడూ ప్రభుత్వం ముసుగులోనే భారత్‌తో చర్చిస్తారు. ఇకముందు కూడా అదే కొనసాగితే పాక్‌లో ప్రధాని పదవిని ఎవరు అధిష్టించినా భారత్‌పై పెద్దగా ప్రభావమేమీ ఉండదు.