: పర్యావరణ హిత పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తాం: మంత్రి కేటీఆర్
తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా పర్యావరణ హిత పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో పర్యటించిన ఆయన సోలార్ రంగానికి మంచి భవిష్యత్తు ఉందని, రెండేళ్లలో సౌరవిద్యుత్ ఉత్పత్తి 5వేల మెగావాట్లకు చేరుతుందని తెలియజేశారు. మంత్రి హరీష్ రావుతో మాట్లాడి త్వరలో శివానగర్‌లో ఎల్ఈడీ లైట్ల తయారీ సంస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే మహిళ పారిశ్రామిక శక్తిని ప్రోత్సహించడానికి సుల్తాన్‌పూర్, నందిగామల్లో విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యూనిట్లను నిర్మిస్తామని అన్నారు. ఇప్పటికే టీఎస్ఐపాస్ ద్వారా చాలా కంపెనీలకు అనుమతులిచ్చామని, అదే స్పూర్తితో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పరిశ్రమల ఏర్పాటును విస్తృతం చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ పరిశ్రమల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇస్తూ, వారికి కావాల్సిన శిక్షణను టాస్క్ ద్వారా అందజేస్తామని వివరించారు. అనంతరం మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి ఇ-వెహికిల్స్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు.