: జియోకు పోటీగా ఐడియా చౌక ఫోన్!
ఉచిత ఫోన్, కేవలం రూ.1,500 డిపాజిట్ చేస్తే చాలు అంటూ ఇటీవలే రిలయన్స్ జియో ప్రకటించిన ఆఫర్ పోటీ సంస్థ ఐడియా సెల్యులర్ ను ఆలోచనలో పడేసింది. ఇప్పటికే జియో ఉచిత డేటా ఆఫర్ పథకాలతో భారీ నష్టాల్లో కూరుకుపోయిన ఐడియా సెల్యులర్ త్వరలో రానున్న జియో చౌక ఫోన్ దెబ్బకు మరిన్ని నష్టాలను ఎదుర్కోనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్లోనే 4జీ బ్రాడ్ బ్యాండ్, నెలంతా ఉచితంగా మాట్లాడుకునే అవకాశాన్ని కేలం రూ.149కే పొందొచ్చని ప్రకటించింది.
ఏప్రిల్ - జూన్ ఈ మూడు నెలల్లోనే ఐడియా సెల్యులర్ ఏకంగా రూ.815 కోట్ల నష్టాలను చవిచూసింది. ఇలా నష్టాల పాలు కావడం వరుసగా మూడో క్వార్టర్. జియో గతేడాది సెప్టెంబర్లో కార్యకలాపాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ ఐడియా నష్టాలను చవిచూస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో జియో చౌక ఫోన్ కు పోటీగా తాము సైతం ఫోన్ తయారీదారులతో ఒప్పందాలు చేసుకుని, బండిల్డ్ ఆఫర్లను ప్రకటించే ఆలోచన చేస్తున్నట్టు ఐడియా ఎండీ హిమాన్షు కపానియా తెలిపారు.