: ఘనంగా రామోజీరావు మనవరాలి వివాహం.. తరలివచ్చిన ప్రముఖులు.. ఫొటోలు ఇవిగో!
రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావు మనవరాలు సహరి వివాహం అత్యంత వైభవంగా నిన్న రాత్రి జరిగింది. భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా, సుచిత్ర దంపతుల కుమారుడు రేచస్ వీరేంద్రదేవ్ తో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. రామోజీరావు పెద్ద కుమారుడు కిరణ్, శైలజా కిరణ్ ల కుమార్తె సహరి. ఈ వివాహ వేడుకకు రాజకీయ ఉద్ధండులు, సినీ ప్రముఖులు, అధికారులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు తరలివచ్చారు. గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు, వైసీపీ అధినేత జగన్, నందమూరి హరికృష్ణ, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయలతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ వేడుకకు వచ్చారు. సినీరంగం నుంచి చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జున, కృష్ణంరాజు, కృష్ణ, పవన్ కల్యాణ్, రాజశేఖర్, జీవిత, రాజేంద్రప్రసాద్, రాజమౌళి, దిల్ రాజు, కోడి రామకృష్ణ, డి.సురేష్ బాబు, రమ్యకృష్ణ తదితర మహామహులంతా తరలివచ్చారు.
నిన్న అర్ధరాత్రి 12.06 గంటలకు సంప్రదాయబద్ధంగా జీలకర్ర బెల్లం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వధూవరులను అతిథులంతా ఆశీర్వదించారు. వివాహ వేడుకకు విచ్చేసిన ఆతిథులకు దక్షిణ భారత సంప్రదాయ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు.