: విక్రమ్ గౌడ్ కేసు: దొరకని గన్.. కొనసాగుతున్న మిస్టరీ.. ముకేశ్ గౌడ్ ఆయుధం స్వాధీనం
తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్‌పై జరిగిన కాల్పుల ఘటనలో సస్పెన్స్ కొనసాగుతోంది. కాల్పుల్లో గాయపడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ గౌడ్ కోలుకుంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే విక్రమ్ భార్య షిపాలీని ప్రశ్నించిన పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. మరోవైపు డీసీపీ వెంకటేశ్వరరావు ఆసుపత్రిలోనే విక్రమ్‌ను విచారించారు.
బయటి వ్యక్తులు వచ్చి కాల్పులు జరిపే అవకాశం లేదని బలంగా నమ్ముతున్న అధికారులు విక్రమ్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులకు పాల్పడిన ఆయుధం కోసం ఆయన ఇంటిలో తీవ్రస్థాయిలో గాలిస్తున్నా ఇప్పటి వరకు పోలీసులకు అది చిక్కలేదు. మరోవైపు విక్రమ్ తండ్రి ముకేశ్ గౌడ్ లైసెన్స్‌డ్ ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.