: డ్రగ్స్, గుడుంబాపై సమాచారమిస్తే లక్ష నజరానా ప్రకటించిన కేసీఆర్
డ్రగ్స్, గుడుంబా వ్యాపారాలపై సమాచారమిస్తే లక్ష రూపాయల నజరానాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో డ్రగ్స్ దందాపై సిట్ విచారణ నేపథ్యంలో... ఎక్సైజ్ ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ పై సిట్ విచారణ పూర్తి వివరాలు తెలుసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ, డ్రగ్స్, గుడుంబా సమాజాన్ని నిర్వీర్యం చేస్తాయని అన్నారు. వాటి వాడకం ప్రమాదకరం అని ఆయన చెప్పారు.
డ్రగ్స్ బారినపడి జీవితాలు నాశనం చేసుకోవద్దని ఆయన హెచ్చరించారు. వాటిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన తెలిపారు. సిట్ పనితీరుపై ఆయన ప్రశంసలు కురిపించారు. తెలంగాణ ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష లేదని, ఎవరినీ లక్ష్యం చేసుకుని తాము పనిచేయమని అన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటామని ఆయన చెప్పారు. హైదరాబాదు నగరాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తయారు చేయడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. డ్రగ్స్, గుడుంబా తయారీ, సరఫరా, వ్యాపారంపై సమాచారం ఇస్తే లక్ష రూపాయల నజరానా ఇస్తామని ఆయన ప్రకటించారు.