: `ఇండియా టుడే` మేగజైన్ కవర్ ఫొటోపై చైనా సోషల్ మీడియాలో దుమారం!
భారతదేశానికి చెందిన ప్రతిష్టాత్మక మేగజైన్ `ఇండియా టుడే` కవర్ ఫొటోపై చైనా సోషల్ మీడియా వైబోలో దుమారం చెలరేగుతోంది. ఈ కవర్ ఫొటోలో చైనా దేశ పటాన్ని పెద్ద కోడి రూపంలో చూపించి, దాని పక్కన పాకిస్థాన్ దేశ పటాన్ని చిన్న కోడి పిల్ల రూపంలో చూపించారు. ఇలా చూపించడంతో చైనా వాళ్లకు చిర్రెత్తిందనుకోవడం పొరపాటే, చైనీయులు కోపం వ్యక్తం చేసేది పాకిస్థాన్‌తో సంబంధాలను చూపించినందుకు కాదు... చైనా పటంలో టిబెట్, తైవాన్ దేశాలను చూపించనందుకు!
ఈ విషయంపై ఇండియా టుడే మేగజైన్‌ను చైనా నెటిజన్లు తూర్పార పట్టేస్తున్నారు. `ముందు చైనా భూభాగ స్థాయిని తెలుసుకోండి`, `త్వరలో ఇండియాను కూడా చైనా పటంలో భాగం చేస్తాం` అంటూ కామెంట్లు చేశారు. దీనిపై ఇండియా టుడే ప్రతినిధులు స్పందిస్తూ - `ఈ మేగజైన్ కవర్ ఫొటోను ఫొటో ఆఫ్ ది డేగా న్యూయార్క్‌కు చెందిన ద సొసైటీ ఆఫ్ పబ్లికేషన్ డిజైనర్స్ వారు గుర్తించినట్లు తెలిపారు. మరో పక్క ఈ కవర్ ఫొటోను తైవాన్ దేశం మాత్రం విపరీతంగా మెచ్చుకుంటోంది. `ఇది అసలైన చైనా పటం` అంటూ తైవాన్ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.