: ధావన్, పుజారా వెనుదిరిగినా పట్టుదల ప్రదర్శించిన అభినవ్ ముకుంద్... వర్షం కారణంగా నిలిచిన ఆట!
గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆటలో అంతరాయం కలిగింది. తొలి రెండు రోజుల ఆటలో భారత్ పూర్తి ఆధిక్యం ప్రదర్శించగా, పిచ్ స్వభావం మార్చుకోవడంతో శ్రీలంక స్పిన్నర్లు అద్భుతమైన బంతులతో ఆకట్టుకుంటున్నారు. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 12 పరుగులకే పెవిలియన్ చేరడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విమర్శలకు బ్యాట్ తో సమాధానం చెప్పాలని ఓపెనర్ అభినవ్ ముకుంద్ నిర్ణయించుకున్నాడు.
మెలికలు తిరిగే బంతులను సమర్ధవంతంగా, ఓపికగా అడ్డుకుంటున్నాడు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరోలు శిఖర్ ధావన్ (14), ఛటేశ్వర్ పుజారా (15) లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరినా ఏమాత్రం తొట్రుపాటు లేకుండా అభినవ్ (27) ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది. ఇంతలో వరుణుడు మ్యాచ్ ను అడ్డుకోవడంతో ఆటకు అంతరాయం కలిగింది. 365 పరుగుల ఆధిక్యంలో టీమిండియా నిలిచింది.