: నేను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాను: అక్షయ్ కుమార్
చిన్నతనంలో తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్టు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తెలిపాడు. మహిళలపైనే కాదు చిన్నపిల్లలపై కూడా లైంగిక వేధింపులు జరుగుతాయని, వాటి గురించి వాళ్లు చెప్పలేకపోయినా తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని ఆయన అన్నాడు. మానవ అక్రమణపై ముంబైలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నాడు. ఈ సందర్భంగా చిన్నతనంలో తాను లైంగిక వేధింపులకు గురైన సంఘటనను గుర్తుచేసుకున్నాడు.
`నా చిన్నతనంలో మా అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో పనిచేసే వ్యక్తి నన్ను అసభ్యంగా తాకేవాడు. నా తల్లిదండ్రుల దగ్గర నాకు స్వేచ్ఛ ఉండటం వల్ల ఈ విషయాన్ని నేను వాళ్లతో పంచుకున్నాను. వాళ్లు లిఫ్ట్ వ్యక్తిని మందలించారు` అని అక్షయ్ చెప్పాడు. తర్వాత అదే వ్యక్తి లైంగిక వేధింపుల కేసులోనే అరెస్టయ్యాడని అక్షయ్ తెలిపాడు. రెండేళ్ల క్రితం తన కుమారుడితో కూడా అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పనిలోంచి తీసేశామని అక్షయ్ చెప్పాడు. తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి బాలీవుడ్ నటీమణులు సోనమ్ కపూర్, కల్కి కొచ్లిన్‌లు బహిరంగంగా వెల్లడించిన సంగతి తెలిసిందే!