: పాము కాటుకు బలైన 'పాముల' శ్రీనివాస్... మందమర్రిలో విషాదఛాయలు
సింగరేణి ప్రాంతంలో ఎక్కడ పాము కనిపించినా, ఒక్క కాల్ చేయగానే వచ్చి పామును పట్టి అడవిలో వదిలేసేవాడు. అసలు పేరు ఎనవేని శ్రీనివాస్. కానీ ఆయన్ని పాముల శ్రీనివాస్ అంటారు. ఎప్పటిలాగే మందమర్రిలోని గ్రీన్‌పార్క్ ప్రాంతం నుంచి పాము కనిపించిందని కాల్ రావడంతో అక్కడికి వెళ్లాడు శ్రీనివాస్. పామును పట్టుకునే ప్రయత్నంలో దాని కాటుకు బలై చనిపోయాడు. ఇప్పటికి ఆరువేలకు పైగా పాములు పట్టి అడవిలో వదిలేసిన శ్రీనివాస్, గ్రీన్‌పార్క్‌లో హరితహారం కోసం ఉంచిన మొక్కల మధ్య చిక్కుకున్న రక్తపింజరను బయటకు తీసే ప్రయత్నంలో దాని కాటుకు గురయ్యాడు. పాము విషం నాడీకణాలపై తీవ్రంగా ప్రభావం చూపించడంతో కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
అతనికి భార్య కృష్ణవేణి, పిల్లలు స్వాతి, అంజలి ఉన్నారు. మందమర్రిలోని సింగరేణి సివిల్ విభాగంలో జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ ఆ ప్రాంతంలో ఎక్కడ పాము కనిపించినా పట్టేవాడని, డబ్బులు తీసుకోకుండా కేవలం పెట్రోల్ చార్జీలు మాత్రమే తీసుకునేవాడని స్థానికులు చెప్పారు. సింగరేణి ప్రాంతంలో స్నేక్ సొసైటీ పేరుతో యువకులకు పాములు పట్టడంలో మెలకువలు నేర్పించేవాడని వారు తెలిపారు. ఖమ్మంలో పాము కాటుతో ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయిన సంఘటన వల్ల తాను పాములు పట్టాలని నిశ్చయించుకున్న విషయాన్ని పలుమార్లు చెప్పేవాడని వారు వివరించారు.