: ఢిల్లీలో అవినీతి 70 శాతం తగ్గింది: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి 70 శాతం వరకు తగ్గిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ విద్యుత్ బోర్డ్ 31వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అవినీతి రహిత ఢిల్లీని ఏర్పాటు చేయడానికి చాలా అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన తెలియజేశారు. మొదట్నుంచి తమ పార్టీ అవినీతికి వ్యతిరేకమని, అలాంటి చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించేది లేదని ఆయన చెప్పారు.
ఢిల్లీలో అవినీతి 100 శాతం తగ్గిందని అనడం లేదని, కాకపోతే తమ పార్టీ అధికారంలోకి వచ్చాక 60-70 శాతం వరకు అవినీతి నశించిందని కేజ్రీవాల్ వివరించారు. వివిధ రకాల ప్రాజెక్టు నిర్మాణాలపై పెట్టుబడి పెట్టకుండా, ఆ డబ్బును ఢిల్లీ ప్రజల సాంఘిక సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఇప్పటి వరకు తాము ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత సర్జరీలు, అలాగే విద్యుత్ ఉద్యోగులకు నగదు రహిత మెడికల్ సేవలు అందజేసినట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు.