: టాలీవుడ్ లో కలకలం రేపుతున్న 'రవితేజ - జిషాన్' బంధం!
హీరో రవితేజకు తానే స్వయంగా డ్రగ్స్ ఇచ్చినట్టు సిట్ అధికారుల విచారణలో జిషాన్ వెల్లడించినట్టు వచ్చిన వార్తలు టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. ఈ వార్తలను అన్ని ప్రధాన పత్రికలూ ప్రముఖంగా ప్రచురించడంతో, సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది. తనకు ఏ మాత్రం ఈ దందాతో సంబంధం లేదని రవితేజ, తన కుమారుడు నిప్పులాంటి వాడని రవితేజ తల్లి వెల్లడించినా, నేటి విచారణలో ఆయన ఎటువంటి విషయాలు చెబుతారన్న విషయంపై ఆసక్తి నెలకొంది. మరోవైపు ఇప్పటివరకూ విచారించిన అందరు సినీ సెలబ్రిటీలతో పోలిస్తే, టాప్ లో ఉన్న రవితేజను నేడు విచారిస్తుండటంతో, సిట్ కార్యాలయం ఎదుట భద్రతను మరింతగా పెంచారు. ఆయన్ను విచారించాల్సిన అధికారులు కార్యాలయంకు చేరుకుని ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
సిట్ నోటీసులు జారీ చేసిన వారిలో రవితేజ పేరు కూడా ఉండటంతో ఓ విధంగా తెలుగు సినీ పరిశ్రమ నివ్వెరపోయింది. ఆయన సోదరుడు, ఇటీవల ఔటర్ రింగురోడ్డులో జరిగిన కారు ప్రమాదంలో దుర్మరణం పాలైన భరత్, గతంలో డ్రగ్స్ వ్యవహారాల్లో పోలీసులకు పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే రవితేజ పేరు కూడా వచ్చింది. అప్పట్లో ఈ కేసుల విచారణ నీరుగారిపోయింది. ఇప్పుడు మాత్రం డ్రగ్స్ దందాపై విచారణ లోతుగా జరుగుతూ ఉండటంతో, ప్రధాన సూత్రధారి కెల్విన్, జిషాన్ విచారణలో రవితేజ పేరు వచ్చింది. ఇక ఇప్పటికే తన తరఫు న్యాయవాదుల సలహాలు తీసుకున్న రవితేజ, ఈ ఉదయం 10 గంటల తరువాత సిట్ కార్యాలయానికి రానున్నాడు.