: పాక్ పంచాయితీ దారుణ తీర్పు... అత్యాచార నిందితుడి చెల్లిని అందరూ చూస్తుండగా రేప్ చేయించారు!
పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ పరిధిలోని ముల్తాన్ అనే ప్రాంతంలోని ఓ గ్రామ పంచాయితీ పెద్దలు దారుణమైన తీర్పిచ్చారు. 16 సంవత్సరాల బాలికను ఆమె కుటుంబ సభ్యుల సమక్షంలోనే అత్యాచారం చేయాలని తీర్మానం చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ముహల్లే అనే గ్రామానికి చెందిన యువకుడు పంచాయితీని ఆశ్రయించి, తన సోదరిని ఓ వ్యక్తి రేప్ చేశాడని ఫిర్యాదు చేశాడు. పంచాయితీ అధ్యక్షుడు విచారణ జరిపి, రేప్ చేసిన యువకుడి సోదరిని నలుగురి మధ్యకూ రప్పించి, ఆమెపై అత్యాచారం చేయాలని, దాన్ని ఆమె కుటుంబ సభ్యులు చూడాలని తీర్పిచ్చాడు. ఈ తీర్పును వారు వ్యతిరేకించినా, ఇదే సరైన శిక్షని చెబుతూ, తమ తీర్పును దగ్గరుండి అమలు చేయించారు. రాజ్ పూర్ అనే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో ఫిర్యాదును అందుకున్న పోలీసులు పంచాయితీ అధ్యక్షుడు సహా 20 మంది పెద్దలను అరెస్ట్ చేసి, కేసును విచారిస్తున్నారు.