: ముద్రగడకు షాక్.. వారం రోజుల గృహ నిర్బంధం!
కాపు నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన 'ఛలో అమరావతి' పాదయాత్రకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. నిన్న పాదయాత్రకు బయల్దేరిన ముద్రగడను పోలీసులు అడ్డుకుని 24 గంటల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ రోజు మళ్లీ పాదయాత్రకు బయల్దేరిన ఆయనను పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏడు రోజుల పాటు మిమ్మల్ని గృహ నిర్బంధం చేస్తున్నామని ఓఎస్డీ రవిప్రకాశ్ రెడ్డి, ఏఎస్పీ నయీం అస్మిన్ లు ముద్రగడకు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసులతో ముద్రగడ వాగ్వాదానికి దిగారు. ఏకంగా వారం రోజుల పాటు గృహ నిర్బంధం విధించడం ఏమిటని ప్రశ్నించారు. ఇన్ని రోజుల పాటు గృహ నిర్బంధం చేసే బదులు... ఏకంగా జైల్లోనే పెట్టొచ్చు కదా అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీనికి సమాధానంగా, ఉన్నతాధికారుల ఆదేశాలను మాత్రమే తాము అమలు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. కాసేపటి తర్వాత ముద్రగడ తన నివాసంలోకి వెళ్లిపోయారు.