: నితీశ్‌పై లాలు ఫైర్.. హత్యకేసులో నితీశ్ నిందితుడు.. అది బయటకొస్తుందనే రాజీనామా.. నిప్పులు చెరిగిన లాలూ!
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితీశ్ కుమార్‌పై ఆర్జేడీ చీఫ్ లాలుప్రసాద్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయనపై ఉన్న హత్యకేసు ఎక్కడ బయటపడుతుందో అనే భయంతోనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారని ఆరోపించారు. నితీశ్ రాజీనామా తర్వాత లాలు మీడియాతో మాట్లాడారు. గత రాత్రి నితీశ్‌తో దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడానని తెలిపారు. అపార్థాలు తొలగించుకోవాలని కోరానని పేర్కొన్నారు. అయితే రాజీనామా గురించి ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదన్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై మీడియా ద్వారా వివరణ ఇవ్వాలని నితీశ్ తనను కోరారని లాలు తెలిపారు.
ఓ మర్డర్ కేసులో నితీశ్ నిందితుడిగా ఉన్నారని, ఆ విషయం ఆయనకూ తెలుసన్నారు. ఆ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్‌లోనూ ప్రస్తావించారని గుర్తుచేశారు. తేజస్వీని రాజీనామా చేయమని కోరితే తనపై ఉన్న క్రిమినల్ కేసు బయటకు వస్తుందన్న భయం నితీశ్‌కు ఉందని, అందుకే ఆయన రాజీనామా చేశారని అన్నారు. రాజీనామా నిర్ణయాన్ని తన సోదరుడు (నితీశ్) ఎందుకు తీసుకున్నాడో తనకు అర్థం కావడం లేదన్నారు. తానైతే రాజీనామా చేయవద్దనే కోరానని లాలు పేర్కొన్నారు.